ఎన్ని ఆశలో... హాకీలో ఫైనల్‌పై భారత్ కన్ను
ఎన్ని ఆశలో... హాకీలో ఫైనల్‌పై భారత్ కన్ను
-సెమీస్‌లో నేడు జర్మనీతో ఢీ
పారిస్: వరుసగా రెండో ఒలింపిక్ పతకంపై కన్నేసిన భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్‌ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన మంగళవారం జరిగే సెమీఫైనల్లో జర్మనీని ఢీకొంటుంది.
కిందిటిసారి కాంస్యం గెలిచిన భారత్... ఈసారి అంతకన్నా మెరుగైన పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. జర్మనీపై గెలిస్తే కనీసం రజతం ఖాయమవుతుంది. ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించడం 5వ ర్యాంకు భారత్‌కు అంత తేలికేమీ కాదు. కానీ క్వార్టర్స్‌లో దాదాపు 40 నిమిషాలపాటు పది మందితోనే ఆడి గెలిచిన తీరు భారత్ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. పైగా టోక్యోలో భారత్ కాంస్యం సాధించింది జర్మనీపై గెలిచే. రెండు జట్ల మధ్య బలాబలాల్లో పెద్దగా తేడా ఏమీ లేదు. జూన్‌లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో జర్మనీని 3-0తో ఓడించిన భారత్... ఆ తర్వాత రిటర్న్ మ్యాచ్‌లో 2-3తో ఓడిపోయింది. ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడుతున్న గోల్‌కీపర్ శ్రీజేశ్ అనుభవం, ఫామ్ భారత్‌కు గొప్ప సానుకూలాంశం. అదే సమయంలో సస్పెన్షన్ కారణంగా కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే. అయితే అతడి గైర్హాజరీలోనూ బలంగా కనిపిస్తోన్న భారత్... ధీమాగా బరిలోకి దిగుతోంది. భారత జట్టు చివరిసారి 1980లో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్, స్పెయిన్ తలపడతాయి.
చక్ దే ఇండియా విలనే...:
భారత్-బ్రిటన్ మధ్య హాకీ క్వార్టర్ఫైనల్లో అమిత్ రోహిదాస్‌కు రిఫరీ జోషువా బర్ట్ రెడ్‌కార్డు చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఆడలేకపోయిన రోహిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం కూడా పడింది. అమిత్‌కు ఎర్ర కార్డు చూపించిన రిఫరీకి బాలీవుడ్‌కు ఓ సంబంధం ఉంది. చక్ దే ఇండియా సినిమాలో అతడు ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కోచ్‌గా నటించాడు. ఆ సినిమాలో విలన్ అయిన అతడు... ఇప్పుడు నిజ జీవితంలో భారత పురుషుల జట్టుకు కూడా విలన్ అయ్యాడంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.