టీమిండియాలో అతనే నా ఫేవరేట్ బౌలర్: ధోనీ
టీమిండియాలో అతనే నా ఫేవరేట్ బౌలర్: ధోనీ
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన పేవరేట్ బౌలర్ అని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ... అభిమానులతో కలిసి ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రస్తుత భారత జట్టులో ఫేవరేట్ బౌలర్? బ్యాటర్ ఎవరో చెప్పాలని ధోనీని ప్రశ్నించాడు.
ఫేవరట్ బౌలర్ బుమ్రా అని వెంటనే చెప్పిన ధోనీ... బ్యాటర్ ఎవరో చెప్పడం కష్టమన్నాడు. 'ఫేవరేట్ బౌలర్ ఎవరో చెప్పడం సులువు. జస్‌ప్రీత్ బుమ్రా. బ్యాటర్ ఎవరో మాత్రం చెప్పలేను. ఎందుకంటే మనకు చాలా మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే బౌలర్లు మంచి వారు లేరని కాదు. బ్యాటర్లను ఎంచుకోవడం కష్టమని చెబుతున్నా.
జట్టులో ఏ బ్యాటర్‌ను చూసినా వారు గ్రేట్ అనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. బ్యాటర్లలో ఏ ఒక్కరి పేరో చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్లు ఇంకా పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అందుకే బెస్ట్ బౌలర్‌ను మాత్రమే ఎంచుకున్నా.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ... ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోనీ వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో సీఎస్‌కే ధోనీని రిటైన్ చేసుకుంటుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తమకు కూడా ధోనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తెలిపింది. ధోనీ అందుబాటులో ఉంటే రిటైన్ చేసుకుంటామని స్పష్టం చేసింది.
2008 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్న ధోనీ ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ... రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చాడు. సొంత అభిమానుల మధ్య ఐపీఎల్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని ధోనీ భావిస్తున్నాడు.
Mahi in a Recent Event Said Jasprit Bumrah is his Current Favourite Fast Bowler ! 🇮🇳😍#MSDhoni #JaspritBumrah #TeamIndia
— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) July 31, 2024
🎥 via @junaid_csk_7 pic.twitter.com/8lRNotBlpv