పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది.ఆల్‌రౌండర్ షోతో సత్తాచాటి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (25; 35 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆఖర్లో ఫాతిమా సాహా (22 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేసింది.
దీప్తి శర్మ (3/20) మూడు వికెట్లతో చెలరేగింది. రేణుక ఠాకూర్ (2/14), పూజ వస్త్రాకర్ (2/31), శ్రేయాంక పాటిల్ (2/14) తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45; 31 బంతుల్లో, 9 ఫోర్లు), షెఫాలీ వర్మ (40; 29 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు.
ఛేదన ఆరంభం నుంచే షెఫాలీ దూకుడుగా ఆడింది. బౌండరీతో పరుగుల ఖాతా తెరిచింది. ఫోర్లు, సిక్సర్‌తో హోరెత్తించింది. స్మృతి కూడా సహకారం అందించడంతో భారత్ పవర్‌ప్లేలో 57 పరుగులు సాధించింది. తొలుత నిలకడగా ఆడిన స్మృతి పవర్‌ప్లే అనంతరం టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. టుబా హసన్ వేసిన 8వ ఓవర్‌లో స్మృతి అయిదు పరుగులు బాది 21 పరుగులు పిండుకుంది.
అయితే దూకుడుగా ఆడే క్రమంలో స్మృతి పెవిలియన్‌కు చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేమలత (14; 11 బంతుల్లో) కూడా బ్యాటు ఝుళిపించడంతో భారత్ 13 ఓవర్లలోపే ఛేదిస్తుందనిపించింది. కానీ షెఫాలీ, హేమలత స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో హర్మన్‌ప్రీత్ (5 నాటౌట్; 11 బంతుల్లో), జెమీమా (3 నాటౌట్, 3 బంతుల్లో) మరో వికెట్ పడకుండా నిదానంగా ఆడి జట్టును గెలిపించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌ను పూజ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లు గుల్ ఫిరోజా (6; 5 బంతుల్లో, 1 ఫోర్), మునీబా (11; 11 బంతుల్లో, 2 ఫోర్లు)ను పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత వికెట్ల వేటలో స్పిన్నర్లు శ్రేయాంక, దీప్తి శర్మ కూడా చేరడంతో పాకిస్థాన్ బ్యాటర్లు విలవిలలాడారు. 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టుబా హసన్ (22; 19 బంతుల్లో, 3 ఫోర్లు), ఫతిమా ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. కానీ భారత బౌలర్లు మరోసారి విజృంభించి క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.