వియత్నాం కమ్యూనిస్టు పార్టీ చీఫ్ ట్రాంగ్ కన్నుమూత
వియత్నాం కమ్యూనిస్టు పార్టీ చీఫ్ ట్రాంగ్ కన్నుమూత
హనోరు: వియత్నాం కమ్యూనిస్టు పార్టీ చీఫ్, దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేత గుయెన్ ఫూ ట్రాంగ్ (80) కన్ను మూశారని అధికార మీడియా శుక్రవారం ప్రకటించింది.
ఆయన గత కొద్ది మాసాలుగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్యాప్య సమస్యలతో బాధపడుతూ సెంట్రల్ మిలటరీ ఆస్పత్రిలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ట్రాంగ్ మధ్యాహ్నం కన్నుమూశారని హాన్ డాన్ వార్తాపత్రిక పేర్కొంది. 2011లో పార్టీ చీఫ్గా ఎన్నికైనప్పటి నుండి వియత్నాం రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. వియత్నాం ఏక పార్టీ రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సంఘటితం చేయడానికి ఆయన కృషి చేశారు.
మేలో కొత్త అధ్యక్షుడు నియమితులవడంతో దేశంలో రాజకీయ పరివర్తన చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ట్రాంగ్ మృతి సంభవించింది. ప్రస్తుతానికి ట్రాంగ్ బాధ్యతలన్నీ దేశాధ్యక్షుడికి అప్పగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం, ప్రభుత్వ నిర్వహణ పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వుంచాల్సిందిగా పార్టీకి, ప్రజలకు, సైన్యానికి పొలిట్బ్యూరో పిలుపిచ్చింది. 2026లో పార్టీ మహాసభ జరిగేవరకు ట్రాంగ్ అనారోగ్యం దృష్ట్యా అధికారంలో కొనసాగలేరని ఇటీవల కాలంలో ఊహాగానాలు వెలువడ్డాయి.
సాంకేతిక నిపుణుడైన ట్రాంగ్కు చైనాతో సత్సంబంధాలున్నాయి. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనం చేకూరింది. ఫలితంగా ఆయన అధికారం, చట్టబద్ధత మరింత బలోపేతమైంది. అవినీతే అన్నింటికంటే అతిపెద్ద ముప్పు అని ఆయన అభిప్రాయపడేవారు. క్రమశిక్షణ లేని దేశం అస్థిరంగా, గందరగోళంగా తయారవుతుందని ఆయన వ్యాఖ్యానించేవారు.