పార్లమెంటు ముందుకు ఆరు కీలక బిల్లులు
పార్లమెంటు ముందుకు ఆరు కీలక బిల్లులు
- లోక్సభ సెక్రెటేరియట్ బులెటిన్ విడుదల- 22 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల జాబితాను గురువారం సాయంత్రం లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇందులో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండవని తెలిపింది.
అయితే ఈ సమావేశాల్లో 90 ఏండ్ల నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని సవరించి, దాని స్థానంలో విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పించే నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం జాబితా చేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశంలో ఆర్థిక బిల్లుతో పాటు 'ది డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు' ను కూడా జాబితా చేసింది. ప్రతిపాదిత చట్టం విపత్తు నిర్వహణ రంగంలో పని చేస్తున్న వివిధ సంస్థల పాత్రల్లో మరింత స్పష్టత, కలయికను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందని లోక్సభ బులెటిన్ తెలిపింది.భారతీయ వాయుయన్ విధేయక్ (బీవీవీ)-2024 పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుమతించే నిబంధనలను అందించడానికి 1934 ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త బిల్లును తీసుకొస్తుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఆమోదించడం కోసం ఆరు బిల్లులను జాబితా చేసింది. స్వాతంత్య్రానికి పూర్వపు చట్టం, కాఫీ ప్రమోషన్, అభివృద్ధి బిల్లు, రబ్బరు ప్రమోషన్, అభివృద్ధి బిల్లు, బాయిలర్ల బిల్లును తీసుకురానున్నారు.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఎసీ)ని కూడా ఏర్పాటు చేస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉన్న కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), పీపీ చౌదరి (బీజేపీ), లావు శ్రీకష్ణ దేవరాయలు (టీడీపీ), నిషికాంత్ దూబే (బీజేపీి), గౌరవ్ గొగోరు (కాంగ్రెస్), సంజరు జైస్వాల్ (బీజేపీ), దిలేశ్వర్ కమైత్ (జేడీయూ), భర్తృహరి మహతాబ్ (బీజేపీ), దయానిధి మారన్ (డీఎంకే), బైజయంత్ పాండా (బీజేపీి), అరవింద్ సావంత్ (శివసేన-యూబీటీ), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బీజేపీ), లాల్జీ వర్మ (ఎస్పీ) సభ్యులుగా ఉన్నారు.