శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు ఇదే!
నో బుమ్రా... కెప్టెన్‌గా సూర్య... శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు ఇదే!
శ్రీలంక పర్యటనతో టీమిండియా కొత్త శకం మొదలవ్వనుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఈ పర్యటనలో ఆతిథ్య శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా... ఈ పర్యటనకు సంబంధంచిన భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించే ఛాన్స్ ఉంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం సీనియర్ ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోగా... శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లి ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో గెలిచింది.
కెప్టెన్‌గా సూర్య...
ఇక శ్రీలంక పర్యటనకు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టు పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్... సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా... హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపిస్తాడని అంతా భావించారు.
కానీ గౌతమ్ గంభీర్... సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా... వర్క్‌లోడ్ మేనేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు.
బ్యాటర్లు ఎవరంటే...?
ఈ సిరీస్‌కు టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌తో పాటు అభిషేక్ శర్మకు చోటు దక్కనుంది. రింకూ సింగ్ కూడా ఫినిషర్‌గా అవకాశం అందుకోనున్నాడు.
వికెట్ కీపర్లుగా పంత్, సంజూ...
టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనుండగా... బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కొనసాగనుండగా, స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. జడేజా రిటైర్మెంట్‌తో వాషింగ్టన్ సుందర్‌కు మార్గం సుగుమమైంది.
బుమ్రాకు రెస్ట్…
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. ఆవేశ్ ఖాన్ మూడో పేసర్‌గా కొనసాగనుండగా... స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్‌ను టీ20 ఫార్మాట్‌కు దూరం పెడితే రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కుతుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే:
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్/ కుల్దీప్ యాదవ్.