పుతిన్ కక్ష సాధింపు...!
పుతిన్ కక్ష సాధింపు...! నవాల్ని భార్యపై అరెస్ట్ వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.
గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.
యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు.