డార్లింగ్ తెలుగు మూవీ కలెక్షన్లు
డార్లింగ్ తెలుగు మూవీ కలెక్షన్లు
ఇండియన్ సినిమా రంగంలో సంచలన విజయం సాధించిన హనుమాన్ నిర్మాతలు నిర్మించిన తాజా చిత్రం డార్లింగ్. హీరోయిన్ నభా నటేష్, యాక్టర్ ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు.
నూతన దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రాబట్టిన కలెక్షన్లు ఎంత? అనే విషయాల్లోకి వెళితే... అపరిచితుడు సినిమా మాదిరిగా స్ప్లిట్ పర్సనాలిటీ కథతో రూపొందిన డార్లింగ్ చిత్రాన్ని కథ డిమాండ్‌కు మించి ఖర్చు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు, టెక్నిషియన్ల పారితోషికంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ లాభసాటిగా ముగిసిందని స్వయంగా నిర్మాత వెల్లడించారు.
ఇక డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... ఆంధ్రా, నైజాం రాష్ట్రాల హక్కులను 5.5 కోట్ల రూపాయలకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హక్కులు 1.5 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్ హక్కులు 1 కోటి రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా రైట్స్ వరల్డ్ వైడ్ 8 కోట్లకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ రిపోర్ట్.
హనుమాన్ నిర్మాతల నుంచి ఈ మూవీ రావడం, ప్రమోషన్స్ భారీగా చేయడంతో డార్లింగ్ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే... కనీసం 15 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక నభ నటేష్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన ఈ సినిమా ప్రతికూల రివ్యూలు వచ్చాయి. దాంతో ఈ సినిమా చాలా పేలవంగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున 75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఒవర్సీస్‌లో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే... అద్బుతమే జరగాలే అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.