ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్...!
ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెంటనే ఆ వివరాలు నమోదు చేయండి, అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానుంది.
వాస్తవానికి ఈ పరీక్ష ఫలితాలు ఈ రోజు అంటే... జూన్ 3న విడుదల చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే... అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో అధికారులు ఫలితాల విడుదలపై తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఈఏపీసెట్ ఫలితాలను పది రోజుల్లో విడుదల చేస్తామని సెట్ నిర్వాహక కమిటీ చైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈఏపీ సెట్ మార్కులకు... ఇంటర్, దానికి సమానమైన కోర్సుల సబ్జెక్టుల్లో అభ్యర్థులు పొందిన మార్కులను 25 శాతంగా వెయిటేజీ కలిపి ర్యాంకులను కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ నేపథ్యంలోనే ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని చెప్పారు.
ఇందుకోసం ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డులు. సీబీఎస్ఈ, ఓపెన్ స్కూల్, RGKUKT ల ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఏపీ విద్యార్థుల మార్కులు ఆటోమేటిక్ గా నమోదు అవుతాయన్నారు. ఇతర బోర్డుల్లో చదివిన విద్యార్థులు తమ మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు.
ఇప్పటి వరకు మార్కులు నమోదు చేయని వారి సెల్ ఫోన్ నంబర్లకు సమాచారం వెళ్తుందని వివరించారు. ఇదిలా ఉంటే... ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ని మే 15 నుంచి నిర్వహించారు.
మే 15 నుంచి 19 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగింది. మే 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది (93.38 శాతం) హాజరయ్యారు.
ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది హాజరు కాగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాల కోసం 90,573 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక 'కీ'లను ఈఏపీసెట్ ఛైర్మన్ ఇటీవల విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను మే 26లోపు స్వీకరించారు.
