Top Ad unit 728 × 90

తెలంగాణ ఇంటర్‌ బోర్డు తప్పుల ఊబిలో కూరుకుపోయిందా!

తెలంగాణ ఇంటర్‌ బోర్డు తప్పుల ఊబిలో కూరుకుపోయిందా!

ఇంటర్‌బోర్డు ఫెయిలయ్యింది. సక్రమంగా పరీక్షలు రాసిన విద్యార్థులను పాస్ చేయాల్సిన బోర్డే ఊబిలో కూరుకుపోయింది. పైగా పొరపాట్లను అపోహలంటూ కొట్టిపారేసింది. బాధితులకు సమాధానం చెప్పకుండా పోలీసులను ఉసిగొల్పింది. ఇంటర్‌బోర్డు పరిసరాల్లో భయానక వాతావరణానికి కారణమైంది. మరి ఈ పరిస్థితులకు అసలు కారణమేంటి? సమస్యలకు బాధ్యులెవరు?.

చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు అపఖ్యాతిని మూటగట్టుకుంది. లక్షల మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేసింది. వేలాదిమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులను బాధపెట్టింది. కనీసం సమస్య చెప్పుకునేందుకు వచ్చినవాళ్ల మాటలు కూడా వినే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో 18మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంటర్‌బోర్డు పనితీరును నిలదీస్తున్నాయి.

సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థుల్లో కొందరు పాసవుతారు. మరికొందరు ఫెయిలవుతారు. పాసైన వాళ్లల్లో కొందరు టాపర్లుగా నిలుస్తారు. ఆ పరీక్షను బట్టి.. ఆ చదువు స్థాయిని బట్టి సంబంధిత శాఖ, బోర్డు ఈ వ్యవహారాన్ని నెరవేరుస్తుంది. పరీక్షల కోసం బాగా చదివిన వాళ్లు ఎవరికీ అన్యాయం జరగకుండా, ఎక్కడా తేడా జరగకుండా అత్యంత అప్రమత్తంగా సాగుతుందీ తంతు. కానీ ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణను సాగించే ఇంటర్‌మీడియట్‌ బోర్డే ఈసారి ఫెయిలయ్యింది.

ఇంటర్‌ బోర్డే ఫెయిలయ్యిందంటే పరీక్షలు రాసిన విద్యార్థుల పరిస్థితి ఏంటి ? వాళ్లమీదే కొండంత ఆశలు పెట్టుకొని తమ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన బాటలు వేస్తున్న తల్లిదండ్రుల రియాక్షన్‌ ఏంటి ? నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఇంటర్‌మీడియట్‌ బోర్డు కార్యాలయం దగ్గర పరిణామాలు వీటికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటామని ఎన్నో కలలు గన్న విద్యార్థుల మెదళ్లు మొద్దుబారాయి. వాళ్ల తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా అంతటా ఆవేదన అలుముకుంది. ఎవరిని కదిలించినా గుండెతరుక్కుపోతోంది. ఆక్రోశంతో గుండెలు మండుతున్నాయి. కన్నీళ్లు ప్రవాహంలా కారిపోతున్నాయి. అధికారుల తీరు, పోలీసుల శైలి వాళ్లల్లో మరింత ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి.

ఫస్టియర్‌లో మండల టాపర్‌గా నిలిచిన అమ్మాయికి సెకండియర్‌లో సున్నా మార్కులు కనిపిస్తాయి. మరుసటిరోజు సాయంత్రానికే సున్నా మార్కులు 99 మార్కులుగా మారిపోతాయి. ఓ విద్యార్థిని సిద్ధిపేటలో తన హాల్‌టికెట్‌ ఎంటర్‌ చేస్తే ఫెయిల్‌ మెమో కనిపిస్తుంది. అదే హాల్‌టికెట్‌ నెంబర్‌ను హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే పాస్‌ మెమో కనిపిస్తుంది. ఓ విద్యార్థి మొదటిసారి చెక్‌చేస్తే ఫెయిల్‌మెమో దర్శనమిస్తుంది. రెండోసారి ఆన్‌లైన్‌లో చూసుకుంటే పాస్‌ మెమో కనిపిస్తుంది. మూడోసారి తిరిగి పరిశీలిస్తే ఫెయిల్‌మెమో వస్తుంది. ఇంకో విద్యార్థికి 17 మార్కులొస్తేనే పాస్‌ అయినట్లు చూపిస్తుంది. ఇవే కాదు, పరీక్ష ఫీజుల చెల్లింపుల దగ్గరినుంచీ హాల్‌టికెట్ల జారీ, ఇప్పుడు ఫలితాల్లో గందరగోళం దాకా ఇంటర్‌బోర్డు ఫెయిలైందనడానికి అనేక కారణాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఇప్పటిదాకా 18మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఫలితాల గందరగోళంలో అసలు ఎవరు పాసయ్యారో, ఎవరు ఫెయిలయ్యారో కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ.. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మానసిక ఆందోళనతో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవేళ.. రీవాల్యుయేషన్‌ తర్వాత చనిపోయిన చిన్నారుల్లో ఎవరైనా పాసయినట్లు తేలితే, వాళ్ల ప్రాణాలు తిరిగొస్తాయా ? దీనికి బాధ్యులెవరు ? ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యారంగ నిపుణులు, విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న ఇది.

ఒక విద్యార్థి చదువులో పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌ అంటేనే కీలక మలుపు. ఇంటర్ ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌, నీట్‌, జెఈఈ వంటి పోటీ పరీక్షల ద్వారా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దారులు ఏర్పరచుకుంటారు. అందుకే ఇంటర్‌ ఫలితాలంటేనే ఓ ఉత్కంఠ ఆవరిస్తుంది. ఫలితాలు వెలువడే నాడు ఇంటర్‌నెట్‌ సెంటర్లు కిక్కిరిసిపోతాయి. ఎవరైనా విద్యార్థులు తమ అంచనాలు తప్పాయనుకుంటే, పాస్ కావాల్సిన వాళ్లు ఫెయిలయినట్లు తెలిస్తే మానసికంగా కుంగిపోతారు. అయితే ప్రతి యేడాది ఈ తంతు ఎక్కడో ఓచోట కనిపిస్తే ఈయేడాది మాత్రం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ఫలితాల్లో గందరగోళమే వెక్కిరిస్తోంది. దీంతో విద్యార్థులే కాదు, వాళ్ల తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.

టాపర్లుగా నిలుస్తామనుకున్న వాళ్లు, ఖచ్చితంగా పాసై తీరతామన్న ధీమాతో ఉన్నవాళ్లు తీరా ఫెయిలయినట్లు చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. పైగా నిత్యం ఎక్కడో ఓచోట విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతున్నాయి. తమ పిల్లలు ఎక్కడ అఘాయిత్యాలకు పాల్పడతారోనని, రాత్రీ పగలూ క్షణ క్షణం కనిపెట్టుకొని చూసుకుంటున్నామని ఇంటర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతుండటం అందరినీ కదిలించి వేస్తోంది.

ఇంటర్‌ ఫలితాల్లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా తేడాలతో షాక్‌ తిన్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు బాట పట్టారు. అధికారులెవరైనా కనికరిస్తారని, పోలీసుల చట్రాలు దాటుకొని బోర్డు కార్యాలయంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, లేదంటే కనీసం అధికారులే తమ వేదనను అర్థం చేసుకొని బయటకు వచ్చి సమాధానం చెబుతారని ఎదురుచూస్తున్నారు. ఓదశలో సహనం కోల్పోయి పోలీసులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం కనికరం చూపడం లేదు. విద్యార్థులు, విద్యార్థినులన్న తేడా లేకుండా తమ ప్రతాపం చూపిస్తున్నారు. తల్లిదండ్రులు మరింత క్షోభ పడేలా ప్రవర్తిస్తున్నారు.

ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అన్నివర్గాల్లోనూ తీవ్రచర్చను లేవనెత్తుతున్నాయి. ఇంటర్‌బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి, ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో, సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో, ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

తెలంగాణ ఇంటర్‌ బోర్డు తప్పుల ఊబిలో కూరుకుపోయిందా! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *