Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

కాశీక్షేత్ర ప్రాముఖ్యత - చూడవలసినవి ప్రదేశ విశేషాలు

కాశీక్షేత్ర ప్రాముఖ్యత - చూడవలసినవి ప్రదేశ విశేషాలు 

 

వివరణ: డా. యం.ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు ఉప నదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిషువారి పాలన సమయంలో వారణాసి, బెనారస్ అయింది.

 

కాశ్యాన్తు మరణాన్ ముక్తి: "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది.

 

ఇక్కడ గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం. ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరంలో లేదా దాని పరిసర ప్రాంతాలతో  అనుబంధం కలిగి ఉన్నారు.

 

కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు:

1. కాశీ విశ్వనాధుని దేవాలం 2. అన్నపూర్ణాలయం 3. విశాలాక్షి ఆలయం 4. కాల భైరవాలయం 5. మృత్యుంజయేశ్వరాలయం 6. సారనాద్ మందిరం 7. వ్యాస కాశి 8. దండపాణి మందిరం 9. చింతామణి గణపతి మందిరం 10. బిర్లా టెంపుల్ 11. సంకట విమోచన హానుమాన్ మందిరం 12. శ్రీ త్రిదేవి మందిరం 13. దుర్గా మందిరం 14. తులసి మానస మందిరం 15. గవ్వలమ్మ మందిరం 16. కేదారేశ్వర మందిరం 17. తిలబండేశ్వరాలయం 18. జంగన్ వాడి మఠ్ 19.గంగా హారతి 20. బిందు మాధవుడు 21. వారాహిదేవి 22. దత్తమందిరం (దత్తపీఠము)  ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు.చిన్న ఆలయాల్లో కూడా పూజా  కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23 వేలకుపైగా దేవాలయాలున్నాయి.

 

చరిత్ర: సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పురాణ కధల ద్వారా తెలుస్తుంది. హిందువుల ఏడు పవిత్ర నగరాలలో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది.

 

పురాణకథనాలు: కాశీ శివ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి నగారాలు. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదకాల ప్రజలిక్కడ నివసించారు. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు మరియు ఆరంభకాల తీర్ధ గురువు అయిన పర్ష్వ జన్మస్థానం.

 

వ్యాపార వాణిజ్యము: వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి.

 

ప్రముఖులు: గౌతమ బుద్ధుడు (జననం 567 క్రీ.పూ) నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.

 

ముస్లిం పాలన కాలంలో కాశీ: మౌర్యుల కాలంలో తక్షశిల మరియు పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీ పట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వసం  చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి.ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ద్వంసం  చేయబడ్డాయి.

 

ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిందువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ద్వంసం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే వారణాసిలో మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాసి  మత సంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి.

 

15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళ పరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.

 

స్వాతంత్రానికి ముందు చరిత్ర: 16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. శివ - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది.16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది.

 

1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయించి మసీదులు నిర్మించాడు. కాశీ నగరం సంస్కృతి పరంగా వెనుకబడింది. ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు పూర్వ వైభవానికి నోచుకున్నాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి. 

 

వాతావరణం: వారాణసి తేమగా ఉన్న వాతావరణం. వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్యఅంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్, అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వలన అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతం నుండి వచ్చే చల్ల గాలుల కారణంగా డిసెంబరు నుండి ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46 °C మధ్య, చలి కాలంలో 5° - 15 °C మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1110 మిల్లీ మీటర్లు చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.

 

గంగానది: గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం మరెన్నో ఆలయాలు, అనేక స్నాన ఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. గంగానదిలోని స్నానం అంటే  కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం.

 

స్నాన ఘట్టాలు: వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతి పలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని అంటారు .

 

దశాశ్వమేధ ఘాట్: కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది. ఇది యాత్రికులతోను, పూజారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలుదీరి ఉండమని కోరాడని పురానవాక్కు .

 

ప్రతి రోజూ సాయంకాలం ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడ ఉన్న పడవలను రేటు మాట్లాడుకుని ఎక్కాల్సి ఉంటుంది. బోటులో  ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూస్తూ ఉంటే నయనానందం కలుగుతుంది. భక్తీ పారవశ్యంతో పొందే మానసిక ఆనందం ఆ అనుభూతి మాటలలో వర్ణించ తరంకాదు.

 

మణి కర్ణికా ఘాట్: మణికర్ణికాఘాటుకు మహా స్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇది .

 

హరిశ్చంద్రఘాట్‌: సత్య హరిశ్చందుడు విధి వశాత్తు "కాటి కాపరి"గా పనిచేసాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.

 

ఇతర మతాలు: బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధన ఉపదేశం చేసాడు. ధమేక స్తూపం అశోకుని కంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థలంలో గౌతమ బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిసాడు అని అంటారు.

 

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

 

కాశీ చూడవలసిన ముఖ్య మందిరాలు - ప్రదేశాలు:

కాలభైరవ మందిరం: కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

 

విశ్వనాధ మందిరం: కాశీ విశ్వనాధ ప్రధాన ఆలయం. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగితా లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ మందిరానికి సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది.

 

విశాలాక్షిమందిరం: కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం.

 

అన్నపూర్ణామందిరం: కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం సత్రాన్ని దేవాలయ ఆద్వర్యంలో  నిర్వహించ బడుచున్నది.

 

శాంక్తా మందిరం: సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తా మందిరంలో పెద్ద సింహం శిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

 

దుర్గా మందిరం: వారణాశిలో రెండు దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఆలయం గోపురం ఉత్తర భారత నగర శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇది వరకు నదితో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత కాలంలో మూసివేశారు. నాగ పంచమి రోజు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

 

సంకట మోచన్ హనుమాన్ మందిరం: కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉంది. మధ్యయుగానికి చెందిన తులసి రామాయణం సృష్టికర్త తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు.

 

తులసీ మానస మందిరం: ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణ కావ్య సంబంధిత తామ్రఫలకలు కొన్ని కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి.

 

భారతమాత ఆలయం: భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మాగాంధీ చేత ప్రారంభించబడింది. ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటం ఉంది.

 

బిర్లా మందిరం: కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబం వారిచే  విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.

 

కవళీ మాత: తపస్సుకు మెచ్చి శివుడు వరమిచ్చాడు నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందుతారు. భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు వెళుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ పుణ్యక్షేత్ర దర్షణఫలితం మాకు ఇవ్వు తల్లి అని ప్రార్థించిన భక్తులకు కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్య ఫలితాన్ని తిరిగి  దకించుకోవాలని విశ్వసిస్తారు, ఈ సంఘటన వెనక ఓ పురాణ కధ ఉంది కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

 

గంగా హారతి: కాశీలో ప్రతిరోజూ  ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు గంగా హారతి చూడడానికి చేరుకుంటారు. ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

 

వసతిగృహాలు: ఇక్కడ జంగంబాడి సత్రం ఉంది గదులు తక్కువ ధరకే ఇస్తారు, ఉచిత భోజనం వసతికూడా ఉంది. మరియు నాట్టు కోట్టై నగర సత్రం తమిళనాడు వారిచే నిర్వహించబడుచున్నది, ఇక్కడ తక్కువ డబ్బుకే గదులు దొరుకుతాయి. సత్రం చాల పరిశుభ్రంగా ఉంటుంది. ఇచ్చట తక్కువ ధరకే ఉదయం టిఫీన్, మద్యాహ్నం భోజనం, రాత్రికి టిఫీన్ లభించును. ఇది తెలుగు వారికి తమిళనాడు వారికి బాగుంటుంది. మరియు శ్రీ వాసవి అన్నపూర్న సత్రం ఉన్నది, ఇక్కడ గదులు దొరుకుతాయి, ఉచిత భోజనం మద్యాహ్నం దొరుకుతుంది. రాత్రికి టిఫన్ దొరుకుతుంది. ఇక్కడ ఆర్య వైశ్యులకు మాత్రమే ఇస్తారు. ఇవికాక ఇంకా ప్రవేట్ హోటల్స్ ఉన్నాయి. అన్నిప్రాంతాల వారికి అన్నిరకాల, ఆహారం దొరుకుతున్నది.

 

కాశీ లో ప్రవేశించగానే ముందుగా కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా గంగా దర్శనం గంగా స్నానం. ఆ తర్వాత  కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం చేసుకోవాలి. కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఉదయం 4 గంటల నుండి 8 వరకు తిరిగి రాత్రి 7 :30 కు  స్పర్శ దర్శనం ఉంటుంది. భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి టైం మారుతుంటుంది.

 

అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం. అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది.

కాశీ విశాలాక్షి దర్శనం, వారాహి మాత గుడి ఈ గుడి ఉదయం 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. ఇక్కడికి లలిత ఘాట్ నుండి వెళ్ళవచ్చు. లేదా విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

 

మణికర్ణికా ఘట్టంలో వీలైతే స్నానం. మధ్యాహ్నం 12-00 గంటలకి గంగా హారతి, దశాశ్వమేధ్ ఘాట్ వద్ద, అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు. కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం. చింతామణి గణపతి దర్శనం, అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం. దుర్గా మందిరము, గవ్వలమ్మ గుడి, తులసీ మానస మందిరము,సంకట మోచన హనుమాన్ మందిరం. తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. తిలాభాండేశ్వర దర్శనం

 

వీలైతే సారనాధ్ స్థూపం  బుద్ధ మందిరం  ఇది కొంత దూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

 

గంగా నదీ ఘట్టాల దర్శనం అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

 

బిందు మాధవుని గుడి ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది. ఓంకాళేశ్వర దర్శనం మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా ఎడమవైపు రోడ్ లో వెళ్ళాలి. రిక్షా అయితే మంచిది. ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు  మకారేశ్వరుడు  చిన్నగా ఉంటాయి కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు. కృత్తివాసేశ్వర లింగం -

ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది. స్వయంభూ లింగం. కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం ఉంటుంది.

 

కాశీలో డ్రెస్ కోడ్ నియమం: నూతన నిబంధనలు అమలు పరచిన వారణాసి ఆలయం. ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాల్ని తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది.  జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే పురుషులు తప్పనిసరిగా ధోతీ - కుర్తా, మహిళలు చీర ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్యాంట్‌, షర్ట్‌, జీన్స్‌, టీషర్ట్‌ లాంటి మోడ్రన్‌ దుస్తులు ధరించి వచ్చే భక్తులు దూరం నుండి మాత్రమే విశ్వేశ్వరుడిని దర్శించుకునే వీలుంటుందని, వారిని గర్భగుడిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు.

కాశీక్షేత్ర ప్రాముఖ్యత - చూడవలసినవి ప్రదేశ విశేషాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *