టీమిండియాలోకి అశ్విన్ రీఎంట్రీ...?
టీమిండియాలోకి అశ్విన్ రీఎంట్రీ...?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రీఎంట్రీపై సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ టీమ్‌లో మాత్రమే కొనసాగుతున్న అశ్విన్... పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతను చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున బ్లూ జెర్సీలో బరిలోకి దిగాడు.
టీ20ల్లోఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 20224లో ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్న అశ్విన్... టెస్ట్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దిండిగల్ జట్టుకు సారథ్యం వహించిన అతను టైటిల్ కూడా అందించాడు.
ఈ టోర్నీలో అశ్విన్ మూడు హాఫ్ సెంచరీలతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. 9 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అశ్విన్... భారత పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపికవుతాడనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... గతంలో ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌కు తగిన గుర్తింపు రాలేదన్నాడు.
అంతేకాకుండా విదేశీ పర్యటనల్లో అశ్విన్‌కు అనుభవం ఉన్ననేపథ్యంలో అతన్ని మళ్లీ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అశ్విన్‌ను ఎంపిక చేయవచ్చు. మరోవైపు జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే జడేజా జట్టుకు దూరమవ్వగా... అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
ఈ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు అశ్విన్ ఈ ఏడాది సెప్టెంబర్ 17న 38వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.