పార్టీ పేరు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్…!
పార్టీ పేరు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్…!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ పేరును ప్రకటించారు.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి సొంతంగా ఎంట్రీ ఇస్తున్నట్లు గతంలో ప్రకటన చేయగా, ఈ రోజు ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. బీహార్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రశాంత్ కిశోర్ తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ పార్టీకి తాను నాయకుడిని కాదని తెలిపారు.
అవును... దేశ రాజకీయాల్లో మరో పార్టీ పుట్టుకొచ్చింది. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ పేరును ప్రకటించారు. ఈ రోజు బీహార్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన... నేటి నుంచి "జన్ సురాజ్ పార్టీ" అనేది తమ పార్టీ అని అన్నారు.
ఇదే క్రమంలో... తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ తనను చాలా మంది అనేక సార్లు, పార్టీ ఎప్పుడు పెడుతున్నారని అడిగారని, దానికి ఈ రోజు సమాధానం ఇస్తున్నానని అన్నారు. అయితే ఈ పార్టీకి తాను నాయకత్వం వహించబోనని, దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన పార్టీ ప్రెసిడెంట్ అవుతారని తెలిపారు. ఇదే సమయంలో... 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ "జన్ సురాజ్ పార్టీ" పోటీ చేస్తుందని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
జన్ సూరజ్ పార్టీ తొలి అధ్యక్షుడు: ప్రశాంత్ కిశోర్ తన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం, ఆ పార్టీ మొదటి అధ్యక్షుడిగా మనోజ్ భారతి పేరును ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన మనోజ్ భారతి మధుబని జిల్ల వాసి. చిన్నతనంలో జాముయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మనోజ్, అనంతరం ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా నాలుగు దేశాల్లో పనిచేశారు! ఈ క్రమంలోనే ఆయనను జన్ సూరజ్ పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ కిశోర్... మనోజ్ భారతి తనకంటే సమర్థులని కొనియాడారు.
కాగా... రెండేళ్ల క్రితం తాను చేపట్టిన జన్ సురాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మలచనున్నట్లు ఇటీవల పీకే పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీ తరుపున పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే ఈ పార్టీకి తాను ఎన్నడూ నాయకుడిని కాదని, అలా ఉండాలని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 2 - 2022న ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పేరుతో ప్రారంభించిన యాత్ర రెండేళ్లు పూర్తి సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అక్టోబరు 2న కొత్త పార్టీ గురించి వెళ్లడిస్తానని తెలిపారు. అనట్లుగానే ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు.