Top Ad unit 728 × 90

శాటిలైట్‌ టర్మినల్‌కు మోక్షం, చర్లపల్లి స్టేషన్‌ అభివృద్ధికి శంకుస్థాపన

శాటిలైట్‌ టర్మినల్‌కు మోక్షం, చర్లపల్లి స్టేషన్‌ అభివృద్ధికి శంకుస్థాపన

 

PSLV TV హైదరాబాద్: నిజాంల కాలంనాటి రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గించే క్రమంలో తలపెట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి ఈ నెల 18న రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని 10వ ప్లాట్‌ఫాం మీద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పనులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పీయూష్‌గోయల్‌ ప్రారంభించనున్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా అందే వేగవంతమైన వైఫై సేవలను కూడా ప్రారంభించనున్నారు.

 

నగర శివార్లలోని, ఔటర్‌ రింగు రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా డిమాండ్‌ ఉంది. ఐదేళ్ల క్రితం దీనికి రైల్వే బడ్జెట్‌లో కూడా ఆమోదం వచ్చింది. ఇటీవలే టెండర్ల దశ పూర్తయినా, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 250 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో శాటిలైట్‌ రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా అనుమతిచ్చింది. ఇదే స్టేషన్‌ మీదుగా ఎంఎంటీఎస్‌ రెండో దశ కొనసాగింపుగా,  రాయగిరి (యాదాద్రి) రైల్వే స్టేషన్‌వరకూ ప్రత్యేక లైను వేయనుండడంతో నగరం నుంచి బయట ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు కూడా వెసులుబాటు ఉంటుందని అందరూ అనుకున్నారు.

 

ప్రభుత్వం భూమి ఇస్తే, స్టేషన్‌ అభివృద్ధి ఎలా చేయాలనే ప్రణాళిక రూపొందిస్తామని ద.మ. రైల్వే చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూ సమీకరణ ఆలస్యం అవ్వడంతో ఆఖరుకు రైల్వే వద్ద ప్రస్తుతం ఉన్న 50 ఎకరాల్లోనే స్టేషన్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేయాలని రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లోని బోయిగూడ వైపు ఈ పనులను ఫిబ్రవరి 18న ప్రారంభమవుతున్నాయి.

 

పండగలొచ్చినా, వేసవి సెలవులొచ్చినా, ఆఖరుకు ఎన్నికల వేళ కూడా సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తుతారు. మిగతా స్టేషన్లపై ఒత్తిడి ఎలా ఉన్నా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మాత్రం తట్టుకోలేని విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగుతాయి. విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఇక్కడ దిగి ఔటర్‌ రింగు రోడ్డు ద్వారా నగరానికి చేరుకునే వెసులుబాటు లభిస్తుంది.

 

శాటిలైట్‌ టర్మినల్‌కు మోక్షం, చర్లపల్లి స్టేషన్‌ అభివృద్ధికి శంకుస్థాపన Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *