Top Ad unit 728 × 90

అందమైన ముఖం కోసం యోగా

అందమైన ముఖం కోసం యోగా...!

అందంగా కనబడటానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. శరీరాన్ని మంచి షేప్‌లోకి తీసుకురావడానికి గంటల తరబడి జిమ్‌ చేసేవాళ్లు కొందరైతే, బ్యూటీపార్లర్‌ సెలూన్స్‌కి వెళ్లి అందంగా తయారయ్యే వాళ్లు ఇంకొందరు. కానీ అందంగా కనిపించే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడైనా మీ మొహం కోసం మీరు కొంత సమయమైనా కేటాయించారా?

చిట్కాల వల్ల మీ ముఖం అందంగానే ఉండి ఉండవచ్చు. కానీ తీరైన శరీరాకృతి కోసం జిమ్‌లో పడే కష్టంలో పదోవంతు ముఖం కోసం కేటాయించరు. ఈ నిర్లక్ష్యం వల్లే బాడీ గొప్పగా ఉన్నా మొహం దగ్గరకొచ్చేసరికి మీద పడుతున్న వయసు కనిపించడంతో పాటు జాగ్రత్తలు లేక పాడైపోతున్న ఛాయలు కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి మరింత పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి.

నిజానికి యవ్వనంగా కనిపించే ఆరోగ్యవంతమైన సహజసిద్ధమైన మొహాన్ని పొందడం చాలా సులభం. మన పురాతన శాస్త్రమైన యోగా ద్వారా యవ్వనవంతమైన ముఖవర్చస్సు పొందే అతి సులభమైన పద్ధతులు ఉన్నాయి.

అందమైన ముఖం కోసం యోగా...!

 

నిజానికి యోగా- శరీరంలోని ప్రతీ భాగానికి వ్యాయామాలు... అలాగే ప్రకాశవంతంగా కనిపించడానికి ఆచరించాల్సిన విధానాల్ని సూచించింది. అయితే ముఖం దీనికి భిన్నం. కండరాలు- ఎముకలతో కాకుండా చర్మానికే జోడించి ఉండే ఏకైక శరీర భాగం మొహం మాత్రమే. అందుకే ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందడంతో పాటు ముఖం ఆకారాన్ని కూడా కాపాడుకోవచ్చు. దీనిద్వారా అతి తక్కువ కాలంలోనే ఎలాంటి ముడతలు లేని సున్నితమైన ఆకర్షణీయమైన ముఖారవిందాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇక ఫేస్‌యోగా అత్యంత సురక్షితం. ఎలాంటి దుష్ఫ్రభావాలు లేని ప్రక్రియ అని అనేక అధ్యయనాలు నిర్వహించి మరీ పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు నిరూపించాయి. వీటిని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా చేయొచ్చు. నిత్యం ఫేస్‌యోగా చేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి కూడా రావు.

ఇది ఎలా పని చేస్తుంది?

యోగాలో సూక్ష్మ యోగా పద్ధతులుగా చెప్పే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు ఉన్నాయి. సులభంగా చేయగలిగేలా ఉండే ఈ వ్యాయామాలు నిమిషాల్లోనే మీ ముఖాన్ని చైతన్యవంతం చేస్తాయి. సింహ ముద్ర (సింహపు భంగిమ) వంటి ఆసనాలు- కండరాలను, నాడీ వ్యవస్థని రిలాక్స్‌అయ్యేలా చేస్తాయి. దీనివల్ల ముఖంపై ఎలాంటి ముడతలు పడవు.

ముఖ్యంగా ఇది కండరాల పెరుగుదలను ప్రేరేపించడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దరి చేరనీయదు. ముఖ్యమైన భాగాల్లోని ప్రధానమైన కండరాలే ఫేస్‌యోగాలో కీలకం: మెడ, నోరు, బుగ్గలు, కళ్లు, నుదురు. ఫేస్‌యోగా వల్ల ఈ కండరాలను కలుపుతూ అనుసంధానంగా ఉండే కణజాలం మెరుగుపడుతుంది. ఆక్సిజన్‌ సరఫరా పెరగడం వల్ల కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే చర్మానికి సాగే గుణానిచ్చే కొల్లాజెన్‌కణజాల వృద్ధిని కూడా ప్రేరేపిస్తుంది. ఇది వయసుతో పాటే దృఢంగా మారుతుంది. ఇది ముఖ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతో పాటు ముఖంపై ముడతలు, గీతల్ని నివారిస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ చర్మం - కండరాల మధ్య కొవ్వు పెరగడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. దీని వల్ల ముఖం కళ తప్పి ఆకృతి మారిపోయి నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మూతి చుట్టూ ముడతలు పడినట్టు కనిపించడంతో పాటు ముఖంలో అనేక మార్పులకు దారి తీస్తుంది. అయితే సులభమైన వ్యాయామాల వల్ల ముఖ చర్మం కింద కండరాల నిర్మాణం జరగడంతో పాటు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. దీంతో సహజంగానే ముఖం మరింత మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంటుంది.

ఫేస్‌యోగా ద్వారా కేవలం ముఖానికే కాదు కళ్లకు కూడా అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. చర్మంతో పాటు కళ్ల చుట్టూ ఏర్పడిన ముడతల్ని, నల్లటి వలయాల్ని సైతం నివారిస్తుంది. దీనివల్ల కళ్లు ప్రకాశవంతంగా ఉండటంతో పాటు ఆలసట కూడా పోతుంది.

చిన్నప్పుడు బుగ్గల్లో గాలి నింపే ఆటలు గుర్తున్నాయా...? సరిగ్గా ఇప్పుడు కూడా అదే చేయండి. నోటితో గాలి పీల్చి నోరు మూసేయండి. గాలిని అటూ ఇటూ రెండు బుగ్గల మధ్య ఆడించండి. 10-15 నిమిషాల వరకు ఇలా చేయండి.

పెదవులు మూసే ఉంచి దంతాలు కనిపించకుండా చెంప కండరాల మీద ఒత్తిడి పడేలా వీలైనంత సాగదీసి నవ్వండి. అలాగే పెదవుల చివర్ల మీద వేళ్లు ఉంచి వాటిని బుగ్గల మీదకు వచ్చేలా పైకి లాగి 20 సెకన్లు పట్టుకోండి.

'ఈ' 'ఓ' అంటూ నోటిని వీలైనంత సాగదీస్తూ చెప్పండి. ఇది బుగ్గలకు మంచి వ్యాయామం.

ఫేస్‌యోగా చాలా సులభం. దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. చాలా తక్కువ సమయంలో దీనివల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఎవరికైనా ఇంతకు మించి ఏం కావాలి?

అందమైన ముఖం కోసం యోగా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *