Top Ad unit 728 × 90

సన్నగా, నాజూకుగా ఉండాలాంటే...!

సన్నగా, నాజూకుగా ఉండాలాంటే...!

అందాన్నీ, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఊబకాయం, అదే అధికబరువంటే అందరికీ హడలే! సన్నగా, నాజూకుగా ఉండాలని అమ్మాయిలందరికీ ఉంటుంది. కానీ టీనేజీలోనే బెలూన్లలాగా లావుగా మారిపోతున్న అమ్మాయిలెందరో ఉన్నారు. తమకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించి తమ ఆనందనాన్ని హరిస్తున్న ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి నిత్యం కొత్త కొత్త పద్ధతులు పాటిస్తూనే ఉంటారు. కొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా, కొన్ని అలవాట్లకు స్వస్తి చెప్పి మరికొన్నిటిని అలవాటు చేసుకోవడం ద్వారా దీని బారినుంచి కొంతవరకూ బయటపడవచ్చు. ఏవి చేర్చుకోవాలి? ఏవి మానేయాలి? ఏవి తినాలి? ఏవి తినకూడదు అన్న వివరాలు....

 క్యాబేజి: ఈ పదాన్ని విన్నా, దీన్ని చూసిన వెంటనే ముఖం చిట్లించుకుంటాం. కానీ ఇది ఆరోగ్యానికే కాదు, ఊబకాయం తగ్గించడానికి కూడా దోహదపడుతుంది అంటున్నారు నిపుణులు. ఇందులోని విటమిన్‌ సి, పీచుపదార్థాలు అధికబరువును తగ్గించడానికి సహాయపడతాయి. నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండడం దీనికున్న మరొక మంచి సుగుణం. అధికబరువుతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా వారంలో కనీసం రెండుసార్లన్నా దీన్ని ఆహారంలో తీసుకుంటే కొన్ని నెలలకు బరువు తగ్గే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.

 పది గ్లాసుల గోరువెచ్చటి నీరు: ఉదయాన్నే పరగడుపున గ్లాసు గోరు వెచ్చటి నీరు తాగడం వలన బరువుతో పాటు పొట్టను కూడా తగ్గించుకోవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే! బరువు తగ్గాలనుకునేవారు రోజు మొత్తం పదిగ్లాసుల గోరువెచ్చని నీటిని తాగితే తక్కువ సమయంలోనే వారు కోరుకున్న ఆకృతిని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పదిగ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం ప్రారంభంలో కొద్దిగా కష్టంగా ఉన్నా, క్రమేపీ అలవాటవుతుందని వారు అంటున్నారు. అధికబరువు తగ్గాడానికే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా గోరువెచ్చని నీరు చాలా మంచిదని వారు చెబుతున్నారు.

 కలబంద: కలబంద అందాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఇది అధికబరువును కూడా తగ్గిస్తుందంటున్నారు. ఇది శరీరంలోని టాక్సిన్లను సమర్ధవంతంగా తొలగిస్తుంది. తొక్క తీసిన రెండు కలబంద ముక్కలను గుజ్జుగా చేసుకొని దానికి కొద్దిగా ఆరంజ్‌ లేదా గ్రేప్‌ జ్యూస్‌ కలుపుకోవాలి. ఈ రెండు అందుబాటులో లేకపోతే నీరు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నెలరోజుల పాటు తాగితే చాలా వరకు బరువు తగ్గుతారు అని నిపుణులు చెబుతున్నారు.

 కరివేపాకు: కూరలో వేసిన కరివేపాకు తీసి పక్కన పడేస్తాం కానీ, దీన్ని తినడం వలన బోలెడన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉదయాన్నే పరగడుపున కొన్ని కరివేపాకు ఆకుల్నినమిలి, ఆ రసాన్ని మింగితే ఊబకాయమే కాదు, డయాబెటిస్‌ కూడా అదుపులో ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ రెండు లాభాలతో పాటు మరికొన్ని ఆరోగ్య లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు.

 కంటి నిండా నిద్ర: కంటి నిండా నిద్ర, కడుపునిండా తిండి ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యా దరిచేరదన్న పెద్దల మాట ముమ్మాటికి నిజం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితంలో కొందరు రోజుకి కనీసం ఐదు గంటలు కూడా నిద్రపోని వారుంటారు. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అన్న సంగతి తెలిసిందే! ఇందులో ఒక్క గంట తగ్గినా కూడా అధికబరువు బారిన పడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. నిద్ర తక్కువయితే జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయని వారు చెబుతున్నారు. అందువలన బరువు తగ్గాలనుకునేవారు ముందు నిద్ర వేళలు మార్చుకోవాలనీ, రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్ర తప్పనిసరిగా పోవాలని వారు సూచిస్తున్నారు.

 పనివేళలు: కష్టపడి పనిచేస్తున్నా కూడా బరువుపెరుగుతున్నామని కొందరు బాధపడుతుంటారు. వారి దృష్టిలో కష్టపడడం అంటే ఏడెనిమిది గంటలు కంప్యూటర్‌ ముందు పనిచేయడం. ఈ కష్టమే వారిని ఊబకాయం వైపు తీసుకెళుతోందన్న విషయాన్ని మాత్రం గమనించరు. ఎటూ తిరగకుండా ఏకధాటిగా అన్ని గంటలు కూర్చుని పనిచేయడం వలన కూడా అధికబరువు సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తవంగా ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోకుండా కొద్ది సేపు అటూ ఇటూ నడవడం చేయాలనీ, ప్రతి పనికీ వాహనాలులు ఉపయోగించడం మానుకోవాలనీ, చిన్న చిన్న పనులను ఇతరుల మీద ఆధారపడకుండా స్వంతంగా చేసుకోవాలని, ఇలాంటి చర్యల ద్వారా కొంత వరకూ అధికబరువు బారిన పడకుండా తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

 ఘాటైన మిర్చి: అధికబరువును అడ్డుకునే గుణం ఎండు మిర్చిలో పుష్కలంగా ఉంది. ఆహారపదార్థాల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగించినట్టయితే అధికబరువు అన్న సమస్యకు కొంత వరకూ దూరంగా ఉండవచ్చు. ఎండుమిర్చి ఘాటు పడని వారు, అల్సర్‌ వంటి సమస్యలతో బాధపడేవారు గ్లాసు నీటిలో స్పూను దాల్చినచెక్క పొడి కలుపుకుని తాగితే మంచి ఫలితాన్నే పొందవచ్చు.

 శారీరక వ్యాయామం: బరువు అదుపులో ఉండాలన్నా, శరీర ఆరోగ్యం బాగుండాలన్నా వ్యాయామం తప్పనిసరి. అయితే చాలా మంది ఊబకాయులు రోజుకు అరగంట నడిస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇది సాధారణ బరువు ఉన్న వారికి కానీ, అధికబరువుతో బాధపడేవారికి కాదు అంటున్నారు నిపుణులు. ఊబకాయులు తమ బరువును తగ్గించుకోవాలంటే రోజుకు గంట పాటు నడిచి తీరాల్సిందే అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలా గంట పాటు నడవడం లేదా రన్నింగ్‌ జాగింగ్‌ లాంటివి పది పదిహేనురోజులు చేసి మానేయకుండా అదొక అలవాటుగా చేసుకోవాలనీ, మధ్యలో మానివేస్తే మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

 మానసిక ప్రశాంతత ముఖ్యం: బరువు తగ్గాలనుకునే వారు మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అనవసర ఒత్తిడి, ఆందోళనలకు గురయితే వ్యాయామం చేసినా ఫలితం ఉండదు. అందుకే పై సమస్యలతో బాధపడేవారు ముందుగా వాటిని తగ్గించుకొని బరువు తగ్గే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

 తొందరపాటు తగదు: బరువును ఒక్కసారిగా తగ్గించుకోవాలన్న ఆరాటంతో రకరకాల పద్ధతులను పాటిస్తూ ఒక్కసారిగా సన్నపడిపోతారు. ఇది అత్యంత ప్రమాదకరమనిన నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా కొన్ని కిలోల బరువు తగ్గడం వలన అంతకుముందు లేని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడమో లేదా, ఉన్నట్టుండి ఒక్కసారిగా మునుపటి కన్నా ఎక్కువ బరువు పెరగడమో జరగవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా బరువు తగ్గడం వలన శరీర మెటబాలిజం ప్రక్రియ కూడా దానికి అనుగుణుంగానే జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం అంటున్నారు.

 గ్రీన్‌ టీ: నిపుణుల సలహా మేరకు రోజుకు మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగడం వలన బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే ఇటీవల నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో గ్రీన్‌టీలో బరువును తగ్గించే గుణాలు లేవు అన్న విషయం తేలింది. ఉన్న బరువును తగ్గించలేకపోయినా, బరువు పెరగకుండా మాత్రం ఇది కచ్చితంగా సహాయపడుతుందంటున్నారు.

 టమోటా: ప్రతిరోజూ ఆహారపదార్థాల తయారీలో ఉపయోగించే టమోటా బరువును తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు బరువు పెరగకుండా సహాయపడతాయి. అయితే దీన్ని ఆహారపదార్థాల ద్వారా కాకుండా నేరుగా తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఉదయాన్నే ఒకటి లేదా రెండు టమోటాలు తినాలని వారు సూచిస్తున్నారు. కొందరు టమోటా గుజ్జును మాత్రమే తీసుకొని పై తొక్కను పడేస్తారనీ, ఇది మంచిదికాదనీ, తొక్కతో సహా తీసుకుంటేనే మంచి ఫలితాన్ని పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

 ఉపవాసం: బరువు తగ్గాలనుకునేవారికి మరో మంచి మార్గం ఉపవాసం. వారంలో ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండడం వలన రోజూవారీ తీసుకునే ఆహారంలో మార్పు వస్తుంది. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. ఉపవాసం వలన కోల్పొయిన శక్తిని పుంజుకోవడానికి పళ్ళరసాలు వంటివి తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 చిన్నతనంలో బీజం!

ఊబకాయం అనేది చాలా వరకూ చిన్నతనం నుంచే ప్రారంభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చదువుకునే రోజుల్లో ఆటలు ఆడుకోకుండా టీవి చూడడమో, ఫోన్లలో గేములు ఆడుకోవడమో చేసే పిల్లల్లో ఎక్కువ శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారన్న విషయం కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. శారీరక వ్యాయామం అనేది చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేసినట్టయితే పెద్దయిన తరువాత అధికబరువు సమస్యను చాలా వరకూ తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

 వంశపారపర్యంగా…!

అధికబరువు అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుందన్న విషయం పలు పరిశోధనలో వెల్లడైన విషయం తెలిసిందే! తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అధికబరువును కలిగి ఉన్నవారు ముందు నుంచి బరువును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం, ఆహారం తీసుకోవాలి. ఇలాంటి వారు బరువు తగ్గడం కష్టమే అంటున్నారు నిపుణులు.

 ఎలా గుర్తించాలి?

బిఎంఐ బాడీ మాస్‌ ఇండెక్స్‌ ద్వారా అధికబరువును లెక్కిస్తారు. వ్యక్తుల వయస్సు, ఎత్తు, బరువు ఆధారంగా బిఎంఎస్‌ లెక్కించడం జరుగుతుంది. సాధారణంగా 18–25 మధ్య బిఎంఐ ఉంటే ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉన్నట్లు భావించాలి. అదే 25 అంతకంటే ఎక్కువ ఉంటే అధికబరువుతో బాధపడుతున్నట్టే! 30కి మించి ఉంటే కచ్చితంగా ఒబెసిటీ కింద పరిగణిస్తారు. బిఎంఐని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం ద్వారా కూడా అధికబరువును అదుపులో ఉంచుకోవచ్చు.

 ఊబకాయం మంచిదే!

అధికబరువు మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అన్న మాటలే తెలుసు. కానీ అధికబరువు కూడా మంచిదే అంటున్నారు పరిశోధకులు. సుమారు 20 లక్షల మంది మీద పది సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. బిఎంఐ(బాడీమాస్‌ ఇండెక్స్‌) 25 మించి ఉంటే అధికబరువుగాను, 30కు మించి ఉంటే ఒబెసిటీగాను వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే! సాధారణ బిఎంఐ ఉన్న వారికన్నా అధిక బిఎంఐ కలిగి ఉన్నవారి మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుందనీ, వారికి డెమ్నెషియా వచ్చే అవకాశాలు 29 శాతం తక్కువగా ఉన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. అధికబరువు కారణంగా మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నా, మెదడు పనితీరు మాత్రం బాగుంటుందనీ వారు స్పష్టం చేస్తున్నారు.

 

సన్నగా, నాజూకుగా ఉండాలాంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *