మహిళా ప్యాసింజర్‌ను దోచుకున్న…!
మహిళా ప్యాసింజర్‌ను దోచుకున్న…!
దేశంలో సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందరికీ స్మార్ట్ ఫోన్ అలవాటు ఉన్న ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్లు ఆన్ లైన్ ద్వారా దొంగతనాలు చేసేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు మెసేజులు, ఫ్రాడ్ కాల్స్, ఓటిపి ఫ్రాడ్స్ గురించి వినే ఉంటారు. కానీ ఒక వ్యక్తి నేరుగా వచ్చి ఇతరుల ఫోన్ లో ప్రత్యేక యాప్ ద్వారా భారీ మొత్తంలో దొంగతనం చేశాడు. ఈ ఘటన బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగింది. పైగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్వయంగా ఈ దోపిడీలో నిందితుడు కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... భార్గవి మని అనే మహిళ ఇటీవల బెంగుళూరు విమానాశ్రయానికి వెళ్లింది. ఆమె ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్ పోర్ట్ లోని వెయిటింగ్ లౌంజ్ కు వెళ్లింది. కానీ అక్కడి సేవలు వినియోగించుకోవాలంటే పేమెంట్ చేయాలి. దీంతో భార్గవి తన పర్సులో క్రెడిట్ కార్డు కోసం వెతికింది. కానీ క్రెడిట్ కార్డు ఆమె ఇంట్లో మర్చిపోయి రావడంతో ఆమె తన ఫోన్ లో దాని ఫొటోని ఎయిర్ పోర్ట్ లౌంజ్ లో పనిచేసే సిబ్బందికి చూపింది.
అయితే ఎయిర్ పోర్ట్ లౌంజ్ లో పనిచేసే యువకుడు భార్గవికి ఎయిర్ పోర్ట్ లౌంజ్ సేవలు వినియోగించుకోవాలంటే క్రెడిట్ కార్డ్ నెంబర్ తో పాటు “లౌంజ్ పాస్” (Lounge pass) అనే యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో వినియోగదారుడి ఫేషియల్ స్కాన్, ఇతర డేటా తెలపాలని సూచించాడు. భార్గవి ఆ యువకుడు చెప్పినట్లే యాప్ డౌన్ లోడ్ చేసుకొని ప్రక్రియ మొత్తం పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె కాసేపు ఎయిర్ పోర్ట్ లోని స్టార్ బక్స్ కాఫీ తాగేందుకు వెళ్లింది. కాఫీ తాగిన తరువాత లౌంజ్ లో విశ్రాంతి తీసుకుందామని అనుకుంది. కానీ ఆమె స్టార్ బక్స్ లో కాఫీ తాగినంత సేపు ఆమె ఫోన్ కు కాల్స్ రాలేదు. ముందు ఆమె ఏదైనా నెట్ వర్క్ సమస్య అయి ఉంటుందని భావించింది. కానీ కాసేపు తరువాత ఫోన్ అంతా బ్లాంక్ అయిపోయింది. దీంతో భార్గవి కాస్త ఆందోళన చెందింది. ఇంతలో ఫోన్ మళ్లీ స్విచాన్ అయింది.
ఆ తరువాత భార్గవి తన ఫోన్ తో కాల్ చేస్తే, ఎవరో గుర్త తెలియని వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇదంతా గమనించి భార్గవికి అనుమానం వచ్చింది. ఆ లౌంజ్ పాస్ డౌన్ లోడ్ చేశాకే ఫోన్ లో ప్రాబ్లమ్ ఉందని గమనించింది. మరోవైపు ఆమె ఫోన్ కు క్రెడిట్ కార్డు నుంచి రూ.87000 డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆ యాప్ సరైంది కాదని గుర్తించిన భార్గవి. వెంటనే వెయిటింగ్ లౌంజ్ కు వెళ్లి చూడగా, ఆ యువకుడు అక్కడ లేడు. భార్గవి తాను మోసపోయినట్లు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోన్ డేటా మొత్తం హ్యాక్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు దొంగతనం చేశారని తెలిపింది. ప్రస్తుతం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. భార్గవి కూడా బ్యాంకులో సంప్రదించి తన క్రెడిట్ కార్డుని బ్లాక్ చేసింది. భార్గవి తనకు జరిగిన మోసం గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
మరోవైపు హాంగ్ కాంగ్ నేకెడ్ వీడియో కాల్స్ స్కామ్ లో 59 మంది బాధితుల నుంచి సైబర్ మోసగాళ్ల రూ.2 కోట్లు దోచుకున్నారు. పోలీసులు దీన్ని హనీ ట్రాప్ కేసుగా నమోదు చేశారు. నేకెడ్ వీడియో కాల్స్ స్కామ్ అంటే ముందుగా ఆన్ లైన్ డేటింగ్ ద్వారా ఒక యువతి బాధితులన సంప్రదిస్తుంది. ఆ తరువాత ఆమె తాను నగ్నంగా చాట్ చేద్దామని ప్రేరెపిస్తుంది. ఆ తరువాత బాధితులు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తుండగా వారిని రికార్డ్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో, బాధితుల బంధువులకు పంపుతామని బెదిరిస్తుంది. హనీ ట్రాప్ గురించి హాంగ్ కాంగ్ లో సైబర్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టడం విశేషం.