Top Ad unit 728 × 90

ఈనెల 18న సింహాద్రి అప్పన్న చందనోత్సవం.....


ఈనెల 18న సింహాద్రి అప్పన్న చందనోత్సవం.....

 

 *చందనం పైపూత కాదు... . చందనం పరిమళం కాదు... ఓ అమూల్య సంప్రదాయం... అదో ఆధ్యాత్మిక సుగంధం... సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా  ఈ చెట్టు అణువణువూ ఎందుకు పూజనీయమైంది?* 

 

చందనం అమూల్యమైన దేవతావృక్షం. మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కింది. షోడశ ఉపచారాల్లో తొమ్మిదో ఉపచారం గంధ సమర్పణ. కేవలం పూజల్లో ఉపయోగించటానికి మాత్రమే కాదు... భారతీయ సంస్కృతిలో చందనానికో ఓ ప్రత్యేకత ఉంది. ఇంటికి అతిథులు వస్తే, వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు. ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు.


 స్త్రీలు చేసుకునే నోములు, వ్రతాల్లో సువాసినులకు చందనం అలంకరించటం తప్పనిసరి. సాధారణంగా నోములు నోచుకునేటప్పుడు సువాసినులకు గంధాన్ని కంఠభాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ ప్రాంతంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండువేళ్లతో గంధాన్ని తీసుకుని, చక్కగా కంఠాన్ని తాకుతూ చందనం రాయటం వల్ల విశుద్ధి ఉత్తేజితమవుతుంది. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం, ఆధ్యాత్మికత కలగలసిన సంప్రదాయం ఇది. వివాహ శుభలేఖల్లో కూడా ‘మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి...’ అని రాస్తారు. చందనంతో చేసే సత్కారానికి గొప్పస్థానం ఉంది. కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతిపాత్రమైన వస్తువుగా స్వీకరించారు.

 *సుగుణ నందనం...* 

 కంసుడి ఆహ్వానం అందుకున్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి ద్వారకకు బయల్దేరతాడు. రాచనగరిలోకి ప్రవేశించి, అక్కడి విశేషాలన్నీ పరిశీలిస్తూ, రాజవీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటారు ఇద్దరు. ఇంతలో కురూపిగా ఉన్న ఓ ముదుసలి కుబ్జ... ‘కన్నయ్యా!’ అంటూ వారి దగ్గరకు వస్తుంది. ఎంతో ప్రేమగా, ‘ఆగవయ్యా! నీ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఇదిగో! నీ కోసం చందనం తెచ్చానయ్యా. ఏదీ ఇటు తిరుగు...’ అంటూ నీలమేఘశ్యాముడికి అద్దుతుంది. శ్రీకృష్ణుడు కూడా అంతే ప్రేమగా స్వీకరిస్తాడు. నువ్వు చేసిన చందన సేవ నాకు చాలా ఆనందాన్నిచ్చిందంటూ ఆమె చుబుకాన్ని పైకెత్తుతాడు. ఆశ్చర్యం...! అష్టవంకరులు తిరిగి ఉండే కుబ్జ అపురూప సౌందర్యరాశిగా మారిపోతుంది. కురూపిని కుందనపు బొమ్మగా మార్చింది చందనమే కదా. 

 

* పరమేశ్వరుడి అభిషేకద్రవ్యాల్లో చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చందనంతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. లలితాదేవికి ‘చందనద్రవదిగ్ధాంగీ’ అనే పేరు ఉంది. ఆమె శరీరమంతా చందనంతో నిండిపోయి ఉంటుందట. 

 

* నారద, తుంబురులు దేవగాయకులు. ఇద్దరూ సంగీత విద్యలో ఆరితేరినవారు. ఓ సందర్భంలో తుంబురుడి గానాన్ని, ఆయన వీణావాదనాన్ని మెచ్చుకున్న విష్ణుమూర్తి తాను ధరించిన హారాన్ని, బంగారువస్త్రాన్ని, ఇంకా అనేక బహుమతులు ఇచ్చి అతడిని సత్కరిస్తాడు. ఇదంతా చూసిన నారదుడికి ఈర్ష్య కలిగింది. కారణం... తుంబురుడు పొందిన రత్నాభరణాలు చూసి కాదట. తన కన్నా బాగా పాడినందుకు, విష్ణువు మెచ్చుకున్నందుకు కూడా కాదట. విష్ణుమూర్తి తాను ధరించే చందనాన్ని స్వయంగా తుంబురుడికి పూయడం నారదుడికి అసూయ కలిగించింది. చందనం పూయటం అవతలి వ్యక్తికి మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీక. ఇదే నారదుడికి మాత్సర్యం కలిగించింది.

 

అయం భగవాన్‌! శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధరమండలాఖండలస్య... వేదాల్ని ఔపోసన పట్టిన వైష్ణవస్వాములు సుస్వరంగా ఏడుకొండలవాడి వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇంతలో అర్చకస్వాములు శ్రీవారి మూలవిరాట్‌కు నమస్కరించి, ముందురోజు చేసిన అలంకారాలన్నిటినీ (నిర్మాల్యం) ఒక్కొక్కటిగా తీయటం ప్రారంభించారు. అదేక్రమంలో స్వామి వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవికి నిన్నటిరోజున అలంకరించిన చందనాన్ని ఒకే ముద్దగా బయటకు తీశారు. పరమాద్భుతం... మాటలకందని మధురానుభూతి... ఇంతకీ ఏం జరిగింది? సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారాన్ని ఆ చందనం సంతరించుకుంది. ఆహా! చందనం చేసుకున్న పుణ్యభాగ్యాన్ని లెక్కించగలమా? లోకనాయకుడి వక్షస్థలాన్ని చేరుకుని, ఏకంగా దేవేరి రూపును తనదిగా చేసుకుంది. గోవిందా! చందనంగా మారి, నీ మేనికి నిత్యం అంటుకుని ఉండే భాగ్యాన్ని కలిగించు స్వామీ!.. భక్తుల హృదయాలు మౌనంగా స్వామిని వేడుకుంటున్నాయి.

 


* చందనాన్ని అరగదీసి, గంధాన్ని తీస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, సందర్భాన్ని బట్టి, కాలాన్నిబట్టి చందనగంధాన్ని తీసేవిధానంలో కొన్ని అనుఘటకాలు చేర్చుతారు. మామూలు నీరు కాకుండా పన్నీరు పోసి, చందన గంధాన్ని తీస్తే మరింత సువాసన వెదజల్లుతుంది. వేసవికాలంలో పచ్చకర్పూరం, చలికాలంలో కస్తూరి చేర్చి, గంధాన్ని తీస్తారు. పునుగు, జువ్వాది, వట్టివేళ్లు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు కూడా చేర్చి, చందనగంధం తీస్తారు. 

 

* ఆహ్లాదంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన విలువలు చందనంలో ఉన్నాయి. చల్లదనాన్ని కలిగించటంతో పాటు శరీరంలోపల ఉండే తాపాన్ని కూడా చందనం తొలగిస్తుంది. ఈకారణంగానే ఆయుర్వేదవైద్యంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. గంధాన్ని కొద్దిమోతాదులో కొబ్బరినీరులో కలుపుకుని తాగితే వెర్రిదాహం తగ్గుతుంది. చందనతైలం శరీరానికి చలువ చేస్తుంది.జ్వరం హెచ్చుస్థాయిలో ఉంటే చందనాన్ని శరీరానికి పూత పూస్తే ఉష్ణోగ్రత నెమ్మదిస్తుంది. కణతల దగ్గర చందనాన్ని రాసుకుంటే, శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అయ్యప్పదీక్షాపరులు కణతల దగ్గర గంధం రాసుకోవటంలో అంతరార్థం ఇదే. మంత్రసాధన చేసే వాళ్లు చందనాన్ని ఛాతి, నుదురు, తలమీద రాసుకోవటం కూడా ఇందుకే. 

 

* బాగా పెరిగిన చందన వృక్షాన్ని చూడగానే మనిషి గొడ్డలి తీసుకుని బయల్దేరతాడు. ఆ వృక్షాన్ని చిన్నచిన్న భాగాలుగా నరికి, వ్యాపారం చేసుకుంటాడు. అప్పటిదాకా పచ్చపచ్చని కొమ్మలతో వెలిగిన వృక్షం ముక్కలుగా మారిపోతుంది. ఇక్కడే చందనం ఇచ్చే సందేశం దాగుంది. తనను నరికిన గొడ్డలికి కూడా చందనం సుగంధాన్ని అద్దుతుంది. తనను నరుకుతూ, ఆయాసంతో తన కిందే సేదతీరటానికి కూర్చున్న మనిషికి తన సుగంధ పరిమళాలను అందించి, చల్లదనాన్నిస్తుంది.

 

 

తనను మరింత చిన్నచిన్న ముక్కలుగా చేసి, రాతిమీద అరగదీసి, చూర్ణం చేసినా, అలా చేసిన కొద్దీ మరింత సువాసన వెదజల్లుతుంది. చివరకు తనను అరగదీసిన చేతికి, రాతికీ కూడా మరింత సువాసన అందిస్తుంది. కేవలం సువాసనాభరితంగా ఉండటం మాత్రమే కాదు... ఆ సువాసనలను అనుసరించి ఉండే బాధల్ని కూడా భరించాలని... ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలకు గురికావలసి వచ్చినా ఉత్తమ లక్షణాలను కోల్పోకూడదనే సందేశాన్నిస్తుంది. అలాగే కష్టాల కొలిమిలో ఎంతగా అరిగినా, మరిగినా, కరిగినా.... మనిషి తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. కష్టాలను ఆనందంగా స్వీకరించి, కొలిమిలో కాలిన బంగారంలా మరింతగా మెరిసిపోవాలి.

 

ఏ దైవానికీ లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరహరికే సొంతం. ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ, సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ... ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం. 364రోజులు చందనంలో ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే స్వామి... వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు. వేడుకగా జరిగే ఈ ప్రక్రియలో ముఖ్య ఘట్టాలివీ...

 

గంధం కోసం మేలురకం చందనం చెక్కలను కేరళ నుంచి తీసుకువస్తున్నారు. అరగదీసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దీనికోసం ఆలయంలోని బేడామండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఈ ప్రక్రియ జరుగుతుంది.
 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *