Top Ad unit 728 × 90

స్పీకర్ కోడెలకు వ్యతిరేకంగా టిడిపి నేతల ఆమరణ దీక్ష....


స్పీకర్ కోడెలకు వ్యతిరేకంగా టిడిపి నేతల ఆమరణ దీక్ష....


నర్సరావుపేట నియోజకవర్గం టిడిపిలో అంతర్గత పోరు పతాకస్థాయికి చేరింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు కోడెల శివరాం తీరును నిరసిస్తూ స్థానిక టిడిపి నేత, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి ఆమరణ దీక్షకు దిగడం సంచలనం సృష్టిస్తోంది.

 

పల్నాటి పులిగా ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే స్పీకర్ కోడెలపై వెంకటరామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం పల్నాడు టిడిపిలో ప్రకంపనలు రేపుతోంది. నర్సరావుపేట నియోజకవర్గం టిడిపికి ఇన్‌చార్జ్‌ని ప్రకటించి పార్టీని బతికించాలంటూ పులిమి వెంకటరామిరెడ్డి పాలపాడులోని తన స్వగృహంలో ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరశన దీక్షలో ఆయన భార్య, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కోటేశ్వరమ్మ కూడా పాల్గొంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

అసమ్మతి...ఆమరణ నిరాహార దీక్ష...

నర్సరావుపేట నియోజకవర్గం పరిధిలో స్పీకర్ కోడెల తీరుకు నిరసనగా టిడిపి నేత, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి భార్య కోటేశ్వరమ్మతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే క్రమంలో ముందుగా ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్‌ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ నరసరావుపేటలో దందాలు చేస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాడని ఆరోపించారు.

 

పలుమార్లు ఫిర్యాదు...పట్టించుకోలేదు...

నర్సరావుపేటలో పార్టీ పరిస్థితిపై గతంలో ఎన్నోమార్లు టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయలు, పార్లమెంట్‌ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్పీకర్‌ కోడెలకు భయపడి అతని కుమారుడి ఆగడాలను ఎవరూ ప్రశ్నించలేక పోతున్నారని వెంకటరామిరెడ్డి ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజక వర్గంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోడెల శివరామ్ వ్యవహారం కారణంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అందుకే ఆయనను నరసరావుపేట నియోజకవర్గం నుంచి తప్పించాలని వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు

 

స్పందించకుంటే...తీవ్రతరం...

పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న కోడెల కుమారుడు శివరామ్ ను వెంటనే నరసరావుపేట నియోజకవర్గం నుంచి తప్పించకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో టిడిపి ఇప్పటికే మూడుసార్లు ఓటమి పాలయిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి వస్తుందని వెంకటరామిరెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు కూడా కోడెల శివరామ్ వైఖరి కారణంగా పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నారని చెప్పారు. తన డిమాండ్ పై 2 రోజుల్లో పార్టీ అధిష్టానం స్పందించకుంటే తన ఇద్దరు కుమారులు, కోడళ్లు కూడా దీక్ష చేపడతారని, అందరం కలసి దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

 

మరోవైపు...పోటీ దీక్ష..

మరోవైపు కోడెలకు వ్యతిరేకంగా వెంకటరామిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు వ్యతిరేకంగా ఇదే నియోజకవర్గానికి చెందిన మరికొందరు టిడిపి నేతలు అదే పాలపాడు గ్రామంలో పోటీ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. వెంకటరామిరెడ్డికి పోటీగా, కోడెలకు మద్దతుగా రిలే దీక్ష చేపట్టినవారిలో పాలపాడు గ్రామ ఎంపీపీ కె.ప్రభాకరరావు, టీడీపీ నాయకులు అలవాల సాంబిరెడ్డి, అడపా వెంకటరెడ్డి, కొమ్ముల కోటేశ్వరరావు తదిదరులు ఉన్నారు. స్పీకర్‌ కోడెల ఆశీస్సులతో పదవులు పొందిన నాయకులే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీపీ కె.ప్రభాకరరావు తెలిపారు. టిడిపికి చెందిన నేతల ఈ పోటాపోటీ దీక్షలతో పాలపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.


 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *