మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా....!
మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా....!
మక్కా మసీదు పేలుళ్ల కేసుపై విచారణ జరిపి, తీర్పు ఇచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయ స్థానం జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు.అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది తెలియలేదు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా హైకోర్టుకు పంపించారు.
రాజీనామా చేయటానికి ముందు ఆయన మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులంతా నిర్దోషులని తీర్పు ఇచ్చారు.2007 మే 18న హైదరాబాద్‌లోని మక్కా మసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.
ఈ దాడికి పాల్పడింది హిందూ అతివాదుల బృందమని దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.దేశంలో హిందూ అతివాదులు పాల్పడినట్లు ఆరోపణలున్న దాడుల్లో మక్కా మసీదు పేలుడు ఘటన ప్రధానమైనది.పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.
పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులోఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తగిన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు ఐదుగురు నిందితులు - అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్, రాజేందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొనగా, వారిలో ఒకరు హత్యకు గురయ్యారు.మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంకో ఇద్దరిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
ఎందుకు రాజీనామా చేశారు?
రవీందర్ రెడ్డి రాజీనామాకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఆయన తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొంత కాలంగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు లాంటి కొన్ని అంశాలపై హైకోర్టుతో విభేదిస్తున్నారు.జ్యుడిషియల్ అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల విచారణ ఏసీబీకి అప్పజెప్పకూడదని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఎవరీ రవీందర్ రెడ్డి?
రవీందర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఈయన తెలంగాణ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.11 ఏళ్లుగా సాగుతున్న మక్కా పేలుడు కేసులో నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన కొద్దిసేపటికే రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య జ్యుడీషియల్ అధికారుల నియామకానికి సంబంధించి 2016 జూన్‌లో ఛలో హైకోర్టు పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించడంతో హైకోర్టు రవీందర్ రెడ్డితో పాటు మరో జడ్జిపై సస్పెన్షన్ విధించింది.రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజనకోసం కూడా జస్టిస్ రవీందర్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు.
