Top Ad unit 728 × 90

అన్నాడీఎంకేలో ప్రకంపనలు

రిసార్టులో ఏం జరిగిందో గుట్టు రట్టు చేస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్

  • అన్నాడీఎంకేలో ప్రకంపనలు
  •  కూవత్తూరు గుట్టురట్టు చేసి తీరతా
  •  కరుణాస్‌ పునరుద్ఘాటన

కూవత్తూరు రిసార్టు గుట్టు రట్టు చేస్తానంటూ తిరువట్టానై ఎమ్మెల్యే కరుణాస్‌ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆయన ఏం చెబుతారు? అది ఎలా తమ కొంపముంచుతుందోనని అధికార పార్టీ నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. నిజానికి కూవత్తూరు రిసార్టులో అసలేం జరిగిందన్నది ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి సరిగ్గా తెలియదు. నగరానికి దూరంగా, ఇతరులెవ్వరికీ అందుబాటులో లేని రిసార్టులో పది రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఎలా వ్యవహరించారు, వారికి ఎవరు నేతృత్వం వహించారన్నదానిపై భిన్నకథనాలు వెలువడ్డాయి. ఆఖరికి కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగినా పట్టించుకోని ఎమ్మెల్యేలు.. శశికళ మాటమేరకు ఈపీఎస్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ గుట్టు ఏమాత్రం రట్టయినా తమ అధికారానికి ఎసరు వస్తుందని ఆ తరువాతి కాలంలో కొంతమంది నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానించడం పలు సందేహాలు రేపినా, ఆ వ్యవహారం అంతటితో సమసిపోవడంతో ఎవ్వరూ దానిని గుర్తు పెట్టుకోలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల స్థానిక వల్లువర్‌కోట్టంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే కరుణాస్‌ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదై, ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించగా బెయిలుపై విడుదలవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో, జయలలిత మరణానంతరం అధికారం కోసం శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూవత్తూర్‌ ఎస్టేట్‌కు తరలించిన సమయంలో జరిగిన విషయాలను తాను న్యాయమూర్తి కోరితే అందజేస్తానని కరుణాస్‌ సంచలన ప్రకటన చేశారు. కరుణాస్‌ వ్యాఖ్యలను పలువురు ఖండించగా, అతనిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నట్టు మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు.

చెక్‌ పెట్టేందుకు సన్నాహాలు..!

కరుణాస్‌కు చెక్‌ పెట్టేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. స్పీకర్‌ ధనపాల్‌తో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం భేటీ కావడం ఇందుకేనని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన కరుణాస్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ను న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం అధికారికంగా అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి ముందు మంత్రి షణ్ముగం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంతో సమావేశమైనట్టు సమాచారం. మొత్తమ్మీద కరుణాస్‌కు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైందని, అందుకే సాక్షాత్తు న్యాయశాఖ మంత్రి పావులు కదుపుతున్నారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. కాగా 2017లో దేవర్‌ పేరవై అధ్యక్షుడు ముత్తయ్యపై జరిగిన దాడి కేసును పోలీసులు తిరగతోడడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ వ్యవహారంలో తిరునల్వేలి జిల్లా నెర్కాట్‌సేవల్‌ పోలీసులు కరుణాస్‌పై తాజాగా విధ్వంసం కేసు నమోదు చేయడం గమనార్హం. అందుకే తనను ఎలాగైనా అరెస్టు చేయించాలని ప్రభుత్వం భావిస్తోందని అనుమానించిన కరుణాస్‌.. ముందుస్తు బెయిల్‌ కోరుతూ సోమవారం మద్రాసు హైకోర్టు మదురైశాఖలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కరుణాస్‌పై ఏమాత్రం చర్య తీసుకున్నా.. ఆయన నోరు విప్పడం ఖాయమని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఆయన ఆ మేరకు మానసికంగా సిద్ధమయ్యారని, గుట్టు రట్టు చేసిన తరువాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం గురించి కూడా ఆయన చర్చించారని కరుణాస్‌ అనుచరవర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఎటు తిరిగీ అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అందువల్లనే కరుణాస్‌పై చర్యలు తీసుకోవడం కన్నా, ఆయన్ని అనునయించడమే మంచిదని ఈపీఎస్‌ భావిస్తున్నట్టు తెలిసింది.

కూవత్తూరు గుట్టురట్టు చేస్తా: కరుణాస్‌

అన్నాడీఎంకే ప్రభుత్వం తనపై కక్ష గట్టి తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే తాను కూవత్తూరు గుట్టురట్టు చేస్తానని తిరువట్టానై ఎమ్మెల్యే కరుణాస్‌ మరోమారు హెచ్చరించారు. ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, తూత్తుకూడి కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండించినవారిలో తాను ఒకడినని, హక్కుల కోసం ఉద్యమం చేపట్టిన వారికి మద్దతుగా మాట్లాడినందుకు అధికార పార్టీ తనను తప్పుడు కేసుల్లో ఇరికించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయని, శశికళకు మద్దుతు తెలిపిన ఎమ్మెల్యేలతో సహా తాను కూడా కాంచీపురం జిల్లాలోని కూవత్తూరు రిసార్ట్‌లో సుమారు 10 రోజులు పాటు మకాం వేశామని, ఆ సమయంలో అక్కడ జరిగిన తంతు గురించి అధికారపార్టీ నేతలు పదవులు పోతాయన్న భయంతో పెదవి విప్పకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

అధికారపార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్న తనపై కక్ష గట్టి తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి కొనసాగితే తాను కూవత్తూరు గుట్టు గురించి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద వివరిస్తానని ఆయన హెచ్చరించారు.

అన్నాడీఎంకేలో ప్రకంపనలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *