ఉచిత కరెంట్‌తో పాటు... మనకే ఎదురు డబ్బు!
కేంద్రం సూపర్ స్కీమ్... ఉచిత కరెంట్‌తో పాటు... మనకే ఎదురు డబ్బు!
సామాన్యులకు ఆసరాగా నిలవడం కోసం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... అనేక పథకాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేలా సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నాయి.
ఇలా తీసుకువచ్చిన పథకాల్లో ఒక దాని గురించి మేం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ పథకానికి అప్లై చేసుకుంటే... ఉచిత కరెంట్‌తో పాటు... ఏడాదికి 32 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవడమే కాక అదనంగా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఇంతకు అది ఏ పథకం... దీనికి ఎలా అప్లై చేసుకోవాలి. ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు... మీకోసం.
విద్యుత్ బిల్లు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారం కోసం సరికొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. అదే పీఎం సూర్య ఘర్ యోజన. దీనిలో భాగంగా... ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగా విద్యుత్ పొందడమే కాక... మిగులు విద్యుత్తును అమ్ముకుని... ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకంలో భాగంగా ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ కల్పిస్తోంది. ఈ పథకంలో చేరడం ద్వారా ఏడాదికి 32 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవడమే కాక... నిరంతర విద్యుత్తు సరఫరాతో పాటు... అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఇంటికి నెలకు 0-150 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే వారికి 1-2 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 150-300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారు. 2-3 కిలో వాట్ల ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే...
అప్లై విధానం ఇలా...
పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి.
తర్వాత మీ రాష్ట్రం, విద్యుత్తు సరఫరా కంపెనీ వివరాలను సెలక్ట్ చేసుకోవాలి.
విద్యుత్ కనెక్షన్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ ఇవ్వాలి.
ఆ తర్వాత మీ విద్యుత్తు కన్జ్యూమర నంబర్, ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యి.. రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి.
ఫాం ఫిల్ చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలి.
పర్మిషన్ వచ్చాక.. డిస్కమ్ గుర్తింపు పొందిన విక్రేతల దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి.
నెట్ మీటర్ ఇన్‌స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు.
ఆ తర్వాత కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ వచ్చాక మీ బ్యాంకు ఖాతా వివరాలతో క్యాన్సిల్ చేసిన చెక్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.
30 రోజుల్లో సబ్సిడీ వస్తుంది.