Top Ad unit 728 × 90

అర్థరాత్రి హైడ్రామా... మరో బాంబు పేల్చిన కుమారస్వామి

అర్థరాత్రి హైడ్రామా... మరో బాంబు పేల్చిన కుమారస్వామి

సంకీర్ణ సర్కార్‌ వ్యూహలతో కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీలో మూడో రోజు కూడా సంక్షోభానికి తెరపడలేదు. అధికార పక్షం, విపక్షాల మధ్య ఆరోపణలు, సవాళ్లు, వాగ్వాదాలతో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఎటూ తేల్చకుండానే సభను ఇవాళ్టికి వాయిదా వేశారు స్పీకర్‌ రమేష్‌ కుమార్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. అయితే రాత్రి 8 గంటల వరకు సమయం ఇవ్వాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య కోరగా అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు స్పీకర్‌.

రెండు రోజుల విరామం తర్వాత తిరిగి సోమవారం సభ ప్రారంభమైనప్పటికీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలకు మాత్రం ఫుల్‌ స్టాప్‌ పడలేదు. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార పక్షం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే నిర్వహించాలని విపక్షం పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంత రాత్రయినా సభలోనే ఉంటామని.. బల పరీక్ష పూర్తి చేయాల్సిందే అని ప్రతిపక్ష నేత యడ్యూర్ప పట్టుబట్టారు. అయితే ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చకుండా బలనిరూపణ ఏంటని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. దీంతో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండాలని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ పదేపదే అధికార పక్షానికి నచ్చజెబుతూ వచ్చారు. రాత్రి 9 గంటలకు బలపరీక్ష జరగకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి వెళ్తానని కూడా హెచ్చరించారు. అటు సీఎం కుమారస్వామి కూడా రాజీనామా లేఖను అసెంబ్లీకి తీసుకొచ్చారని.. బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విశ్వాస పరీక్ష జరుగుతుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్‌-జేడీఎస్‌ మాత్రం విశ్వాస పరీక్షకు ససేమిరా అన్నాయి. తమకు సమయం కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ సూచించిన ఫలితం లేకుండా పోయింది. ఇరు పక్షాల నినాదాలు, గందరగోళం మధ్య మూడో రోజు కూడా సభ వాయిదా పడక తప్పలేదు.

ఇదిలా ఉంటే కర్నాటక సీఎం కుమారస్వామి మరో బాంబు పేల్చారు. తాను రాజీనామా ఇవ్వక ముందే తన పేరుతో నకిలీ రాజీనామా తయారు చేయించారని ఆరోపించారు. దానిపై తన సంతకం ఫోర్జరీ చేసి వాట్సాప్‌లో వైరల్‌ చేశారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు కుమారస్వామి. దీంతో రాజకీయం మరింత రక్తి కట్టింది. మరీ ఇవాళైనా కర్నాటక సంక్షోభానికి ఎండ్ కార్డు పడుతుందా? లేదా నాలుగో రోజు కూడా కర్నాటక నాటకాన్ని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అర్థరాత్రి హైడ్రామా... మరో బాంబు పేల్చిన కుమారస్వామి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *