Top Ad unit 728 × 90

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీకి తీవ్ర హెచ్చరికలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీకి తీవ్ర హెచ్చరికలు...!

అమెరికా - టర్కీ మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దు దళాలపై టర్కీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇటీవల సిరియా నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ నిర్ణయించారు. దీంతో అక్కడి కుర్దు దళాలపై టర్కీ దాడులు చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. కుర్దులను టర్కీ తీవ్రవాదులుగా పరిగణిస్తోంది. వారి కారణంగా దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుర్దులను ఉద్దేశించి ఆదివారం ఒక ట్వీట్‌ చేశారు. టర్కీని రెచ్చగొట్టే చర్యలు చేపట్టవద్దని కుర్దులకు హితవు పలికారు.

''ఎప్పటి నుంచో అనుకుంటున్న బలగాల ఉపసంహరణ సిరియాలో మొదలైంది. ఐసిస్‌ అక్కడ నామమాత్రంగానే మిగిలింది. ఒక వేళ అది మళ్లీ పడగవిప్పితే సమీప స్థావరాల నుంచి ఐసిస్‌పై దాడులు చేస్తాం. కుర్దు బలగాలపై టర్కీ దాడులకు తెగబడితే ఆ దేశాన్ని ఆర్థికంగా నాశనం చేస్తాము. 20 మైళ్ల మేరకు సురక్షిత జోన్‌ను ఏర్పాటు చేయాలి.''

''అలానే కుర్దులు కూడా టర్కీని రెచ్చగొట్టకూడదు. ఐసిస్‌ను నాశనం చేయాలన్న అమెరికా నిర్ణయం నుంచి సిరియా, ఇరాన్‌, రష్యాలు లబ్ధిపొందుతున్నాయి. మేము కూడా లబ్ధిపొందాము. కానీ అంతం లేని ఈ యుద్ధానికి ఒక ముగింపు పలికేందుకు ఇప్పుడు బలగాలను వెనక్కి పిలిపిస్తున్నాము.'' అని ట్రంప్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి అమెరికా బలగాలు సిరియా నుంచి వైదొలగడం ప్రారంభించాయి. కేవలం 2,000 మంది సైనికులు మినహా మిగిలిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ బలగాల ఉపసంహరణ కొన్ని వారాలపాటు కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ఐసిస్‌పై తమ ఒత్తిడి కొనసాగుతుందని శ్వేతసౌధం తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీకి తీవ్ర హెచ్చరికలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *