దీర్ఘకాలం వేధించే సొరియాసిస్ గుట్టు రట్టు…!
దీర్ఘకాలం వేధించే సొరియాసిస్ గుట్టు రట్టు…!
ఎర్రటి మచ్చలు, తెల్లటి పొలుసులతో దీర్ఘకాలం వేధించే సొరియాసిస్ గుట్టు బయటపడింది. దీన్ని హెప్సిడిన్ హార్మోన్ ప్రేరేపిస్తున్నట్టు అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం గట్టిగా సూచిస్తోంది.
అందువల్ల హెప్సిడిన్‌ను సొరియాసిస్‌కు బలమైన కారకంగా పరిగణిస్తున్నారు. సాధారణంగా ఈ హార్మోన్ క్షీరదాల్లో ఐరన్ మోతాదులను పర్యవేక్షిస్తుంటుంది. ఆహారం నుంచి ఎంత ఐరన్‌ను గ్రహించుకోవాలి, తర్వాత దాన్ని శరీరంలోకి ఎంత విడుదల చేయాలనే దాన్ని నియంత్రిస్తుంది. ఐరన్ మనకు చాలా కీలకం.
ఇది ఒంట్లో రక్తం ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేయటంతో పాటు చర్మ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. గాయాలను మాన్పటం, కొలాజెన్ ఉత్పత్తి, రోగనిరోధక వ్యవస్థ పనితీరు వంటి అత్యావశ్యక పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. కానీ చర్మంలో ఐరన్ మోతాదులు పెరిగితే మాత్రం హానికరంగా పరిణమిస్తుంది. అతి నీలలోహిత సూర్యకాంతి దుష్ప్రభావాలను పెంచుతుంది.
కణాలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే సొరియాసిస్ వంటి దీర్ఘకాల సమస్యలకూ దారితీస్తుంది. సొరియాసిస్ బాధితుల చర్మ కణాల్లో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటున్నట్టు చాలాకాలం క్రితమే బయటపడింది. అయితే దీనికి కారణమేంటి? సొరియాసిస్‌కూ దీనికీ సంబంధమేంటి…?
అనేవి తెలియరాలేదు. ఇందుకు హెప్సిడిన్ హార్మోన్ కారణం కావొచ్చని ఇప్పుడు తేలింది. ఆరోగ్యవంతుల్లో ఇది కాలేయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సొరియాసిస్ బాధితుల్లో చర్మంలోనూ పుట్టుకొస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది.
సొరియాసిస్ జీవితాన్నే మార్చివేసే చర్మ సమస్య. దీని బారినపడ్డ వారు శారీరకంగానే కాదు, మానసికంగానూ ఇబ్బంది పడుతుంటారు. ఇది ఇతరత్రా తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చర్మంలో హెప్సిడిన్ హార్మోన్ మోతాదులను సరిచేయగల కొత్త చికిత్సలతో ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంతో పాటు గోళ్లు, కీళ్లనూ ప్రభావితం చేసే తీవ్రమైన, మందులకు లొంగని పశ్చులర్ సొరియాసిస్‌తో బాధపడేవారికిది ఎంతో మేలు చేయగలదని భావిస్తున్నారు.